*కాఫీవిత్..ఆర్..రమాదేవి..
*పొయెట్రీ…586
*ఏయ్..! పిలగాడా..నువ్వు నా జట్టే కదా!
*నీ కోసం తాంత్రిక విద్యలైనా నేర్చుకుంటా.!!
*పిలగాడా! నీకింత పంతం కూడదు..!!
రమాదేవి మార్క్ కవిత ఇది..
ప్రేమకవితల్లో ఇదో రకం.ప్రేమ రసం తాగినోళ్ళు ఎంతవరకైనా వెళతారు.. ఏమైనా చేస్తారు…ఈ రోజు కాఫీటైమ్ కవితలో కూడా రమాదేవి నాయిక అచ్చం ఇలానే చేస్తోంది 'అతడికోసం ఏమైనా చేయటానికి సిద్ధం'అంటోంది. అదేదో తెలుసుకునేముందు రమాదేవి కవిత ఓ సారి చదవండి..!!
*ఈవేళ ఎందుకో...
పలకకపోతే ఎన్నాళ్ళు పలకరిస్తావంటూ...
ఈ పిల్లాడు పంతం పట్టాడు చూడు...
ఏమని చెప్పాలి ..ఎలా చెప్పాలి
అతని నీడను నాకు తాకట్టు పెట్టాడని
మరిచిన వాడితో ఏమని చెప్పాలి...
తప్పుకొని పోవడం రాని నీకు
పలకరింపుల కథ ఎందుకోయ్...
నీ మౌనంలో సరిగమల వినడం నేర్చుకుంటాలే...
నొప్పించలేక బుజ్జగింపు సందేశం ఒకటి పంపాను
ఓయ్..
అయినా నా సంగతి తెలుసు కదా
నీ జట్టుగా ఉండడానికి
మంత్ర తంత్రాలు.. తప్పకపోతే
తాంత్రిక విద్య కూడా నేర్చుకుంటాలే...
ఏదేమైనా కానీ
ఇంతకూ....
నువ్వు నా జట్టే కదా ❤️
*ఆర్..రమాదేవి…!!
ఓ సారి ప్రేమ పిచ్చిపడితే..ఓ పట్టాన వదలదు గాక వదలదు..ఆ ప్రేమ కోసం ఎంతవరకు వెళ్ళ డానికైనా సిద్ధపడతారు..ఈ కవితలో కూడా… "ఆమె"..ఇలానే చేస్తోంది. "నా సంగతి తెలుసు కదానీ జట్టుగా ఉండడానికి మంత్ర తంత్రాలు,తప్పకపోతే..తాంత్రిక విద్య కూడా నేర్చుకుంటాలే.."అంటోంది..ఇంతకూ ఈ విద్యలన్నీ ఎందుకో తెలుసుకదా! అతగాడ్ని … కొంగున కట్టేసుకొందుకే సుమా!
రమాదేవి కవితల్లో ఓ మెరుపు వుంటుంది.కొన్ని పదప్రయోగాలు మనసును చుట్టేసుకుంటాయి. ఈ కవితలో...
"ఏమని చెప్పాలి .?.ఎలా చెప్పాలి ? అతని నీడను నాకు తాకట్టు పెట్టాడని" అంటుంది. తన నీడను తాకట్టు పెట్టడమంటే ఆమె వెన్నంటి వుంటాననేకదా! వాచ్యంగా చెప్పకుండా ఇలా.. అర్ధోక్తితో చెప్పడం రమాదేవి ప్రత్యేకత..!
నీడను తాకట్టుపెట్టికూడా…మరిచిపోతే ఎలా అయినా..అలా మరిచిన వాడితో ఏమని చెప్పాలి... ఎలా చెప్పాలన్నది ఆమె సంశయం.?
ఏయ్..!అమ్మాయ్!అంటూ రోజూపలకరించేవాడే. కానీ,ఈవేళ ఎందుకో...మారాం చేశాడు. పంతం పట్టాడ..కారణం తెలీదు..!
అయినా…..
ఆమె ఏమైనా తీసిపోయిందా?
అతగాడి మౌనంలో కూడా సరిగమల వినడం నేర్చుకుంటానంటోంది.సరే..! ఎందుకులే అని.. అతగాడ్ని నొప్పించలేక బుజ్జగింపు సందేశం ఒకటి పంపింది..మనిషి ఎదురుపడితే….తప్పుకొని పోవడం రాని నీకుపలకరింపుల కథ ఎందుకోయ్.? అంటూ నిలదీసింది..
సరేలే….!
నా సంగతి నీకు తెలుసుకదా!
ఓ మానాన నిన్ను ఒదిలి పెట్టను గాక పెట్టను.
ఓయ్.. !
నీకు నా సంగతి తెలుసు కదా!
నీ జట్టుగా ఉండడానికి మంత్ర తంత్రాలు.. తప్పకపోతేతాంత్రిక విద్య కూడా నేర్చుకుంటా నీడలా వుంటానన్నోడివి.నీడలా వుండు… మధ్య ఈ వికారపు చేష్టలెందుకు..నువ్వు… దూరంగా వున్నా..ఒక వేళ వుండాలనుకున్నా.. నేను మాత్రం వదిలిపెట్టను…నీ కోసం ఎక్కడి దాకైనా వెళతా..! ఏ సముద్రపు అంచునైనా తాకుతా.…
అంతెందుకు….?
నిన్ను వశం చేసుకొని,నా చుట్టూ తిప్పుకోడానికి అవసరమైతే మంత్ర,తంత్రాలు,తాంత్రిక విద్యలైనా నేర్చుకుంటా!
జట్టుగా వుంటానన్నోడివి మాట తప్పక… జట్టుగా వుండు..లేకుంటే నా సంగతి తెలుసు కదా ఎక్కడిదాకైనా పోతా! ఏమైనా… చేస్తా! బి కేర్…!!
ఇప్పుడు చెప్పు బంగారం….
నువ్వు…
నా జట్టే కదా..!
అంటోందామె….
ఇదీ ప్రేమలో పంతాలు..పట్టింపులు సహజమే అయినా…పట్టువిడుపులు కూడా వుండాలన్నది ఆమె భావన.!!
*ఎ.రజాహుస్సేన్…!!